ఇన్సూరెన్స్ పాలసీల పేరుతో 15 లక్షల మోసం

ఇన్సూరెన్స్ పాలసీల పేరుతో 15 లక్షల మోసం
  • యూపీలో ఉన్న నిందితులను పట్టుకొచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులు
     

హైదరాబాద్: నగరానికి చెందిన ఓ 80 ఏళ్ల వృద్ధురాలిని సైబర్ కేటు గాళ్లు ఇన్సూరెన్స్ పాలసీలు, వాటి లాయాలిటీ, రివర్సల్ బోనస్ ల పేరుతో మోసం చేశారు. బోనస్ డబ్బుల కోసం ఆ వృద్ధురాలి నుండి ఆర్బీఐ, ప్రాసెసింగ్, సెబీ వివిధ చార్జీల పేరుతో 15.47 లక్షలు కొట్టేశారు. నిందితులు చేసిన మోసం గుర్తించిన వృద్ధురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుల కోసం నిఘా పెట్టగా యూపీలో ఉన్నట్లు గుర్తించారు. నిందితుల కోసం వలవిసిరిన సైబర్ క్రైమ్ పోలీసులు ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ కి చెందిన దేవాన్ష్, ఇమ్రాన్ ఖాన్ లను  అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. నిందితులిద్దరికీ కోర్డు రిమాండ్ కు ఆదేశించగా మరో నిందితుడు రస్టజీ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడ్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామని సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టం చేశారు.